రేవంత్ భయపడినట్లే జరిగింది

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదలచేయబోతోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు ఆరోపించారు

Update: 2025-09-24 08:51 GMT
Revanth Reddy

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భయపడినట్లే జరిగింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో రెండు కేసులు దాఖలయ్యాయి. బీసీలకు 42శాతం(BC 42% reservations) రిజర్వేషన్ అమలుచేయటం రాజ్యాంగ విరుద్ధమని బుట్టెంగారి మాధవరెడ్డి, జలపల్లి మల్లవ్వ పిటీషన్లు వేర్వేరుగా(Two cases filed) దాఖలుచేశారు. వీరిద్దరికి బీసీరిజర్వేషన్లతో సంబంధం ఏమిటో తెలీదు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవాపూర్ కు చెందిన మాధవరెడ్డి, సిద్ధిపేట జిల్లా చిన్నకొండూరు మల్లవ్వలు తమ పిటీషన్లలో రాజ్యాంగాన్ని రేవంత్(Revanth) ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదలచేయబోతోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలును అడ్డుకోవాలని పిటీషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించిపోతుందని అన్నారు. రిజర్వేషన్లు 50శాతానికి మించటం గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని గుర్తుచేశారు. ‘కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని సుప్రింకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం-2018లో కూడా రిజర్వేషన్లకు 50శాతం పరిమితిని విధించిన విషయాన్ని పిటీషనర్లు గుర్తుచేశారు. అదేవిధానాన్ని తొందరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించేట్లుగా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషనర్లు హైకోర్టును రిక్వెస్టు చేశారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 26శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 9 శాతం అమలవుతున్నట్లు చెప్పారు. సుప్రింకోర్టు తీర్పును ఉల్లంఘించి చట్టంలో మార్పులుతెచ్చి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పిటీషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయటం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే సుప్రింకోర్టు, రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశ్యం ఓడిపోయినట్లు అవుతుందని పిటీషనర్లు ఆందోళన వ్యక్తంచేశారు.

రేవంత్ భయం ఏమిటి ?

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అందుబాటులో ఉన్నఅవకాశాలను ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయించి కేంద్రానికి పంపింది. మళ్ళీ అసెంబ్లీలో మరో బిల్లు ఆమోదింపచేసుకుని ఆర్డినెన్సు జారీకోసం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ నేపధ్యంలోనే తనను కలసిన బీసీ సంఘాల నేతలతో రేవంత్ మాట్లాడుతు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కోర్టులో కేసులు వేయకుండా అడ్డుకోవాల్సిన బాద్యత సంఘాల నేతలకే ఉందన్నారు. కారణం ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు రాజ్యాంగవిరుద్ధమని రేవంత్ కు బాగా తెలుసు. బీసీలను ఆకర్షించి స్ధానికఎన్నికల్లో లబ్దిపొందటానికి మాత్రమే రేవంత్ ప్రభుత్వం ఇలాగ చేస్తోంది. ఎవరైనా కోర్టులో సవాలుచేస్తే ప్రభుత్వ నిర్ణయం రద్దవుతుందని రేవంత్ కు బాగా తెలుసు. అందుకనే కోర్టులో ఎవరూ కేసు వేయకుండా చూడాలని సంఘాల నేతలకు చెప్పింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు దాఖలైన రెండు కేసులపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News