Asha Workers | ‘రేవంత్ రెడ్డికి మా తడాఖా ఏంటో చూపిస్తాం’

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఆశావర్కర్లు రోడ్డెక్కారు. ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.;

Update: 2024-12-09 11:35 GMT

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఆశావర్కర్లు రోడ్డెక్కారు. ఎన్నికల హామీల్లో చెప్పినట్టుగా తమకు రూ.18వేల ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలి డిమాండ్ చేస్తూ కోఠీలోని డీఎంఈ ఆఫీదు దగ్గర ఆశా వర్కర్లు శాంతియుతంగా నిరసన చేపట్టారు. కాగా వారి చేత నిరసన విరమించుకునేలా చేయడం కోసం పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమపై పోలీసులు అకారణంగా దాడులకు పాల్పడ్డారని ఆశా వర్కార్లు పేర్కొన్నారు. తమ పట్లు పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు మాత్రం తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని అన్నారు. ఈ సందర్భంగా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, నోరు పారేసుకున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి క్షమాణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిస్థితులు వేరేలా ఉంటాయని, తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

కుక్కల్లా కనిపిస్తున్నామా..

తమపై పోలీసులు చేసిన దాడిలో ఒక ఆశా వర్కర్ కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయినా పట్టించుకోకుండా వ్యాన్‌లోకి ఎత్తేశారని, మరో ఆశా వర్కర్ తనకు అస్వస్థతగా ఉందని చెప్పినా వినిపించుకోకుండా గంటకుపైగా సిటీలో తిప్పారని, పోలీసుల కళ్లకు తాము కుక్కల్లా కనిపిస్తున్నామా అంటూ ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆశావర్కర్‌కు ఏమైనా అయితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహిళల పట్ల పోలీసులు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, నానా బూతులు తిడుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శాపనార్ధాలు పెట్టారు. ‘‘మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అంతకంత అనుభవిస్తాడు సీఎం. మమ్మల్ని పోలీసు వాళ్లతో కొట్టించి, రోడ్డుపైకి లాగించిన సీఎంకు మా తడాఖా చూపిస్తాం. మాకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. లేదంటా ఆశాల తడాఖా ఏంటో చూపిస్తాం’’ అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆశా వర్కర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

ఏంటీ దుర్మార్గం..?: కేటీఆర్

‘‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం..? ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా..? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా..? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు..? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా..? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా..? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా..? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలుచేస్తున్నారు. మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు’’ అని హెచ్చరించారు కేటీఆర్.

Tags:    

Similar News