కేంద్ర బోర్డు వచ్చినా పసుపు పంటకు గిట్టుబాటు ధర ఏది?

తెలంగాణలో కేంద్ర పసుపు బోర్డు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.భారీవర్షాలు,దుంపకుళ్లుతో దిగుబడి తగ్గగా, ధర పడిపోయింది.దీంతో రైతులు ఆందోళనబాట పట్టారు.;

Update: 2025-03-18 01:19 GMT
నిజామాబాద్ మార్కెట్ లో పసుపు : గిట్టుబాటు ధర ఏది?

ఈ ఏడాది భారీవర్షాలు, దుంపకుళ్లుతో పసుపు దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గడంతోపాటు తాము కష్టపడి పండించిన పసుపునకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతన్నారు.ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో 80వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. రాష్ట్రంలో 1.20 లక్షల ఎకరాల్లో పసుపు పంటను రైతులు వేశారు. పసుపు బోర్డు వచ్చిందని, మంచి ధర వస్తుందని పసుపు వేస్తే తమకు ధర రాక తీవ్రంగా నష్టపోయామని పసుపురైతుల సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది భారీవర్షాల వల్ల దుంపకుళ్లు రోగం వచ్చి పసుపు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్లకు తగ్గింది. ఒక్కో రైతు పసుపు పంటలకు ఎరువులు, కలుపుతీత, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టడానికి ఎకరానికి లక్షరూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టారు. కనీసం తాము పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని పసుపు రైతుల(Turmeric Farmers) సంఘం నాయకుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.



పసుపు క్వింటాలుకు రూ.15వేల మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో పసుపు రైతులు రాస్తారోకో చేశారు. గత ఏడాది ఇదే సీజనులో పసుపు క్వింటాలుకు రూ.18 వేలు ధర పలకగా, ఈ ఏడాది రూ.8వేలకు తగ్గిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు రైతులు ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.


ఎగుమతులకు ఆర్గానిక్ పసుపు పండించండి
13,500 నుంచి 10వేల రూపాయల దాకా పసుపు బోర్డు తెచ్చిన ఎంపీగా చెబుతున్నా, ఉత్తర తెలంగాణ రైతులు ఎగుమతి చేసే ఆర్గానిక్ పసుపు పండించాలని కోరారు. మద్ధతు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారంటే ఎంపీ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు పసుపుబోర్డు తీసుకురావడం చేత కాలేదు.పసుపునకు గిట్టుబాటు రావడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నా ఎంపీ ధర్మపురి అర్వింద్ దాన్ని దాటవేశారు.


ప్రభుత్వమే పసుపు కొనుగోలు చేయాలి
పసుపుబోర్డు వచ్చినా మద్ధతు ధర రాక రైతులు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పసుపు క్వింటాలుకు రూ.15వేల చొప్పున మద్ధతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.‘‘నిజామాబాద్ లోని ఖరీద్ దారులు కొందరు అధికారుల సహకారంతో సిండికేట్ అయ్యి పసుపు ధరను తగ్గిస్తున్నారు. ఒకే రకమైన పసుపు నిజమాబాద్ లో ఒక రేటుకి, సాంగ్లిలో ఒక రేటుకి అమ్ముడుపోతుంది.పసుపు రైతుకు మద్ధతు ధర రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన చేశారు.పసుపు రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.



 నెరవేరని పసుపు రైతుల ఆశలు

పసుపు బోర్డు ఏర్పాటు కాగానే తాము పండించిన పంటకు మద్ధతు ధర వస్తుందని రైతులు ఆశించారు, కానీ పసుపు బోర్డు వచ్చాక క్వింటాలు ధర 8 వేలకు పడిపోయింది. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు కుప్పలను వేలంలో పాడటం లేదు.గత ఏడాది పసుపు ధర రూ.16వేలు పలకగా ఈ ఏడాది సగానికి తగ్గింది. వ్యాపారుల సిండికేట్ పై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు.సాంగ్లీలో 14వేల రూపాయలున్నా, నిజామాబాద్ మార్కెట్ లో తక్కువ ధర ఇస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ లో రూ.12000 కు అమ్ముడు పోయిన పసుపు, ఇప్పుడు రూ. 8000 కి అమ్ముడు పోతుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.



 పసుపునకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

పసుపునకు మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నిజామాబాద్ లో పసుపు ధరలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున భారత వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) మార్కెట్ జోక్య పథకం కింద పసుపును కొనుగోలు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు తుమ్మల కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. పసుపు ధర తగ్గిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని తుమ్మల అభ్యర్ధించారు.


Tags:    

Similar News