తెలంగాణ సౌత్ ఇండియా బీర్ క్యాపిటల్. అదే గొడవకు కారణం

పార్టీ కల్చర్, చౌకగా, విరివిగా దొరకడంతో తెలంగాణలో బీర్ డిమాండ్ పెరిగింది. బీర్ రెవిన్యూ వేల కోట్లకు చేరింది. దీనితో తెలంగాణ మీద నాయకుల, డిస్టిల్లరీల కన్నుబడింది

Update: 2024-05-30 09:20 GMT

అసలే పార్లమెంట్ ఎన్నికల సీజన్...ఆపై వేసవికాలం మండుతున్న ఎండలు... మందుబాబులు చిల్ అయ్యేందుకు చల్లటి బీర్ కోసం మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.దీంతో బీరు కొరత ఏర్పడింది. గత ఏడాది ఇదే నెలలో మొదటి 18 రోజుల్లో 4.23 కోట్ల బీర్ బాటిళ్లు ఖాళీ అయ్యాయి.  సగటున రోజూ 1,95,847 బీర్ క్యాన్స్,  23,50,164 బీర్ బాటిల్స్ ఖాళీ అయ్యాయి.

ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఆ 18 రోజుల్లోనే  ప్రభుత్వానికి  రు. 582.99 కోట్ల రెవిన్యూ వచ్చింది.  ఆ పద్దెనిమిది రోజుల్లో బీర్ లాగించడంలో నల్గొండ జిల్లా టాపర్ గా నిలించింది.కరీంనగర్ ది రెండో స్థానం. రాష్ట్రమంతా చూస్తే గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా రు.34,000 కోట్ల ఖరీదయిన బీర్ అమ్ముడు వోయింది. ఏయేటి కాయేడు రాష్ట్రంలో టెంపరేచర్ పెరుగు పోతున్నది. ఇదే చాలా యువకులను చల్లటి బీర్ వైపు మళ్లిస్తున్నదని చాలా చెబుతున్నారు.

రాష్ట్ర యువకులు, ముఖ్యంగా హైదరాబాద్ యువకుల రుచి మారుతున్నదని, వాళ్లు బీర్ నే ఇష్టపుడుతున్నారనీ నేషనల్ రెస్టరాంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) పేర్కొంది. దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్. కాని బీర్ సేవనంలో మాత్రం సౌత్ ఇండియాలో బాగా ముదురు అయిందని NRAI పేర్కొంది. హైదరాబాద్ లో పెరుగుతున్న పబ్ ల సంఖ్యయే దీనికి సాక్ష్యమని ఈ ఎన్ ఆర్ ఎ ఐ పేర్కొంది. 

ఇపుడు సౌత్ ఇండియా బీర్ క్యాపిటల్ గా  తెలంగాణకు పేరొచ్చింది. తెలంగాణలో తలసరి బీర్ వినియోగం 11 లీటర్లు. ఇదే ఆంధ్రాలో కేవలం 4.43 లీటర్లే. బీర్ చౌకగా ఉండటం, ఈ జీ గా దొరకడం, హైదరాబాద్ లో పార్టీ కల్చర్ పెరగడం కూడా బీర్ వినియోగం పెరగడానికి కారణమని ఒక వైన్ షాపు యజమాని చెప్పారు. బీర్ లో మార్కెట్ విపరీతంగా పెరగడంతో కొత్త బీర్ బ్రాండ్ లను ప్రవేశపెటేందుకు డిస్టిల్లరీస్ ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ప్రభుత్వం అనుమతి కావాలి. ఇక్కడే కోట్ల కుంభకోణం ఉంది. దీనితోె రాష్ట్రంలోకి వస్తున్న కొత్త బ్రాండ్లు  రాజకీయవివాదాన్ని సృష్టించాయి.

బీర్ కొరత... కొత్త బ్రాండ్లకు తలుపులు తెరించింది

 తెలంగాణలో పెరిగిన బీరు డిమాండుకు అనుగుణంగా సప్లయి లేక పోవడంతో బీరు తీవ్ర కొరతగా మారింది. వేసవి కాలం ముగింపు సందర్భంగా ఎండలు తీవ్రం కావడంతో బీరు కోసం మందుబాబులు నానా అవస్థలు పడుతున్నారు.  తెలంగాణలో  పెరిగిన బీరు డిమాండుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బ్రాండ్ బీర్ల కొనుగోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన బీరు కొరత...కొత్త బీరు బ్రాండ్లకు ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచిన నేపథ్యంలో తెలంగాణలో బీరుపై రాజకీయం సాగుతోంది. కొత్త బ్రాండ్ల రాక రాజకీయ వివాదంగా మారింది. ఇదొక పెద్ద కుంభకోణమని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి విమర్శిస్తూ ఉంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు దీనిమీద సరైన స్పందన రాలేదు. కొత్త బీర్ బ్రాండ్లకు అనుమతి లేదని ఒకసారి, బీరు బ్రాండ్ల  వ్యవహారం బీవరేజెస్ కార్పొరేషన్ చూసుకుంటుందని మరొక సారి ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించి ఇంకా కన్ ఫ్యూజన్ సృష్టించారు.
తెలంగాణలో 19 మద్యం కంపెనీలు
తెలంగాణ రాష్ట్రంలో 19 మద్యం తయారీ కంపెనీలున్నాయి.వీటిలో ఆరు బీరు తయారు చేసే కంపెనీలు.ఈ బ్రూవరీలలో ప్రతి నెలా 50 లక్షల బీరు కేసులు ఉత్పత్తి అవుతున్నాయి.ఈ కంపెనీలకు రాష్ట్రమే ముడిసరుకును సరఫరా చేస్తుంది.ఆ తర్వాత మద్యం తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిటైలర్లకు పంపిణీ చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి బీరు కొనుగోలు
బీరు ఉత్పత్తిలో కొరత ఏర్పడినప్పుడల్లా బేవరైజెస్ కార్పొరేషన్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీరు కొనుగోలు చేయడం తెలిసిందే. రాష్ట్రంలో 2,620 మంది రిటైలర్లు ఉండగా 19 డిపోల ద్వారా మద్యం పంపిణీ చేస్తున్నారు.ప్రతీ వేసవిలోనూ మందుబాబులు అధికంగా చల్లటి బీరు కోసం ఎగబడుతుంటారు.ఈ సారి వేసవికి తోడు ఎన్నికల సీజన్ కావడంతో బీరు వినియోగం గణనీయంగా పెరిగింది.

డిమాండ్ మేర బీరు సప్లయి ఏది?
తెలంగాణలో గత నెలరోజులుగా బీరు కొరత ఏర్పడింది. మందుబాబుల డిమాండుకు అనుగుణంగా 330 ఎంఎల్ పింట్ బీర్లు, 650 ఎంఎల్ బీర్లు దొరకడం లేదని మందుబాబు జీ వెంకటేశ్వర్లు చెప్పారు. బీరు కొరత వల్ల తమకు కావాల్సిన మేర సప్లయి చేయడం లేదని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పబ్ యజమాని చెప్పారు.

బీరు తాగి చిల్ అవుదామంటే...
గతంలో వంద బీరు కేసులు సప్లయిచేసే వారని, ప్రస్థుతం కొరత వల్ల కేవలం రోజుకు 9 కేసులే వస్తున్నాయని మల్కాపూర్ ప్రాంతానికి చెందిన శివా వైన్స్ షాపు మేనేజర్ చెప్పారు.హైదరాబాద్‌ నగరంలో నెలరోజులుగా తనకు ఇష్టమైన కింగ్ ఫిషర్, బడ్ వైజర్ బీర్లు అందుబాటులో లేవని సాఫ్ట్ వేర్ ఇంజినీరు పంజాల శ్రీనివాస్ చెప్పారు.వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో చల్లటి బీరు తాగి చిల్ అవుదామంటే దొరక్క అవస్థలు పడుతున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీరు కొరతకు కారణాలు...
తెలంగాణలో బీరు కొరతకు పలు కారణాలున్నాయి. ఎన్నికల సీజన్...దానికి తోడు వేసవికాలం కావడంతో బీరు వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీనికితోడు చాలా మంది చిల్లర వ్యాపారులు బీరును లైసెన్స్ లేని బెల్టు షాపులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.కింగ్‌ఫిషర్, బడ్‌వైజర్ లైట్ బీర్‌లు మహిళలు, యువత అధికంగా తీసుకుంటున్నారు. అధిక డిమాండ్ ఉంది. గతేడాది ఏప్రిల్‌ నెల వరకు 42 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది మే 23 వరకు 52 లక్షల కేసుల బీరు విక్రయాలు దాటింది. బీరుకు ఏర్పడిన అధిక డిమాండ్‌ను తీర్చడం తయారీదారులకు కష్టమవుతోంది.

బీరుకు కృత్రిమ కొరత
మద్యం తయారీ కంపెనీలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం కూడా బీరు కొరతకు ప్రధాన కారణమని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. బీరు తయారీ కంపెనీలకు ప్రతి 45 రోజులకు డబ్బు చెల్లించాలి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సకాలంలో కంపెనీలకు డబ్బు చెల్లించలేక పోయారు. దీంతో మార్కెట్‌లో బీరు కృత్రిమ కొరత సృష్టించేందుకు కంపెనీలకు అవకాశం కల్పించినట్లయింది. ఈ మండే వేడిలో పార్టీ ర్యాలీల్లో పాల్గొనేవారికి చల్లటి బీరుతో ట్రీట్ ఇస్తుండటంతో మద్యం దుకాణాల్లో బీర్‌ కేసులు వేగంగా మాయమవుతున్నాయని ఓ మద్యం దుకాణం యజమాని చెప్పారు.

బీర్ల సప్లయి పెంచుతాం : వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్
ప్రతి సంవత్సరం వేసవిలో బీర్ల విక్రయాలు పెరుగుతాయని, డిమాండ్‌కు అనుగుణంగా బీర్లను సప్లయి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ వైన్‌షాప్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు చెప్పారు.ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా బీరు తయారీదారులు అవసరమైన పరిమాణంలో సరఫరా చేయలేకపోతున్నారు.

తెలంగాణలో బీర్లకు క్రేజ్
దేశంలోనే అత్యధికంగా బీరు వినియోగిస్తున్న తెలంగాణలో ఎంతో క్రేజ్ ఉంది. రాష్ట్రంలో మద్యం వినియోగం కంటే తలసరి బీరు వినియోగం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.వేసవిలో బీర్‌ తాగేందుకు మందుబాబులు ఆసక్తి చూపిస్తుంటారు.బీరు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం కొన్ని కొత్త బీరు బ్రాండ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ బీర్‌లను సరఫరా చేయడానికి అనుమతి పొందింది. తెలంగాణలో మద్యం విక్రయాలు పండుగల సీజన్‌లో అధికంగా జరుగుతుంటాయి.

మార్కెట్ లో త్వరలో కొత్త బ్రాండ్ బీర్లు
తెలంగాణలో కొత్త మద్యం కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. సోం డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ కంపెనీ, ఎక్సోటికా లిక్కర్ ప్రైవేట్ లిమిటెడ్ , కర్ణాటకకు చెందిన టాయిట్ బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మద్యప్రదేశ్ కు చెందిన మౌంట్ ఎవరెస్ట్ లిమిటెడ్, లీలాసన్స్ అల్కా బేవ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ దబాంగ్, లేమౌంట్, మౌంట్స్,6000, బ్లాక్ బస్టర్ రకాల బీర్లను విడుదల చేస్తారని సమాచారం.

బీఆర్ఎస్ నేతల ప్రశ్న
తెలంగాణలో బీరు అమ్మేందుకు కొత్త బ్రాండ్లు అనుమతి తీసుకోలేదని కాంగ్రెస్ మంత్రి ప్రెస్ మీట్‌లో ప్రజలకు ఎందుకు అబద్ధం చెప్పారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.కొత్తగా మద్యం కంపెనీలకు కాంగ్రెస్ సర్కారు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. మరో వైపు రాష్ట్రంలో బీరు కొరత తీర్చేందుకు చర్యలు తీసుకంటామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో బీరు సీసాలు లేవని వైన్ షాపు యజమానిపై కొందరు యువకులు దాడి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టుకునేలోపే యువకులు వాగ్వాదానికి దిగారు.

బీరు కొరత తీర్చాలని మందుబాబుల సంక్షేమ సంఘం వినతి
మండుతున్న ఎండల కారణంగా వారానికి ఒకటి, రెండు సార్లు విస్కీ తాగే వారు నిత్యం బీరు తాగుతున్నారని నాచారం ప్రాంతానికి చెందిన ఓ మద్యం దుకాణం సేల్స్ మెన్ చెప్పారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. బీరు కొరత తీర్చాలంటూ ఆ సంఘం అధ్యక్షుడు కె.తరుణ్ ఇటీవల మంచిర్యాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని బార్‌లు, మద్యం దుకాణాలలో కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొరత ఉందని, వీలైనంత త్వరగా ఈ బీరు ఉండేలా చూడాలని తరుణ్ కోరారు.



Tags:    

Similar News