డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం టీ న్యాబ్ అడుగులు

తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కార్యాచరణ మొదలైంది. టీ న్యాబ్ డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ కోసం అడుగులు వేస్తోంది.

Update: 2024-06-10 01:50 GMT
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా చేస్తామంటూ టీన్యాబ్ పోలీసు అధికారుల ప్రతిన

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో త్వరలో నాలుగు ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

- మాదక ద్రవ్యాల వ్యాపారం,వినియోగాన్ని అరికట్టడానికి వీలుగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అత్యంత అధునాతన పరికరాలను సమకూర్చారు.
- తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను దేశంలోనే అత్యుత్తమ యాంటీ డ్రగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మార్చారు. దీని కోసం టీ న్యాబ్ కు ఆర్థిక, లాజిస్టిక్స్ మద్దతును అందించారు.
- ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష సమావేశం తర్వాత బ్యూరో అధికారులు డ్రగ్స్ నిరోధానికి సన్నాహాలను వేగవంతం చేశారు.

డ్రగ్స్‌ను అరికట్టేందుకు టీన్యాబ్ నాలుగు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు
తెలంగాణలో డ్రగ్స్ డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా దీని నిరోధానికి ఒక ప్రణాళికను టీ న్యాబ్ రూపొందించింది.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలను డ్రగ్స్ ఫ్రీ కేంద్రాలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ఇక నుంచి డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు
తెలంగాణలో డ్రంకన్ డ్రైవ్ పరీక్షల తరహాలో కొత్తగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని టీ న్యాబ్ అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా టీ న్యాబ్ కు ప్రత్యేకంగా కిట్లు అందించారు. డ్రగ్స్, గంజాయి తీసుకున్న వారిని గుర్తించేందుకు ఎబోన్ యూరిన్ కప్ యంత్రాలను పోలీసులకు అప్పగించారు. మూత్ర పరీక్షలు చేసి డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించారు.

టీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా

సందీప్‌ శాండిల్య పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ శాండిల్య పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 1993 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన టీన్యాబ్ డైరెక్టర్‌గా గతేడాది డిసెంబర్‌ 13న బాధ్యతలు తీసుకున్నారు.డ్రగ్స్ ను నివారించేందుకు సందీప్ శాండిల్యా హెచ్ న్యూ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ఆదేశాల మేరకు తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని సందీప్ శాండిల్యా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

డ్రగ్స్ కేసుల నమోదుపై పోలీసులకు శిక్షణ
డ్రగ్స్ పై ఫిర్యాదులు, దర్యాప్తు, నేరస్థలం నుంచి నమూనాల సేకరణ, వినియోగదారులను గుర్తించడం, నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ఈ ప్రత్యేక పోలీసుస్టేషన్ల అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్న డ్రగ్స్ కేసుల సంఖ్యను పెంచడానికి బలమైన ఛార్జిషీట్‌లను దాఖలు చేయడంలో పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

డ్రగ్స్ కేసుల నమోదుకు టీన్యాబ్ కు అధికారం
ఎఫ్‌ఐఆర్‌లను జారీ చేయడానికి టీన్యాబ్ కు అధికారం ఉంటుంది. టీ న్యాబ్ అధికారులు డ్రగ్స్ కేసును గుర్తించడం, నిందితులను అరెస్టు చేయడం నుంచి నేరారోపణ వరకు కేసులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. గతంలో మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించలేకపోయారు. డ్రగ్స్ నమూనాలను సేకరించడం, వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపడంలో ప్రత్యేక పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం టీ న్యాబ్ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి కోరారు. ఇటీవల తాము సీఎంకు దీనిపై వినతిపత్రాన్ని కూడా సమర్పించామని పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా షార్ట్ ఫిలిం పోటీలు
జూన్ 20వతేదీన ఇంటర్నేషనల్ డే అగినెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ 2024 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ వల్ల సమాజంపై పడుతున్న పెడధోరణుల గురించి షార్ట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చెప్పారు. ఈ షార్ట్ ఫిలింలలో ఎంపిక చేసిన మూడు బెస్ట్ షార్ట్ ఫిలింలకు నగదు బహుమతులు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.

డ్రగ్స్ గురించి సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయండి
తెలంగాణలో డ్రగ్స్ గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 8712671111కు తెలియజేయాలని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులు కోరారు. డ్రగ్స్ గురించి ఫిర్యాదు చేయాలన్నా టోల్ ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు.


Tags:    

Similar News