HYDRA | 2024 సూపర్ స్టార్.. హైడ్రా!
హైడ్రా..2024కి సూపర్ స్టార్ గా నిలిచింది. హైదరాబాద్ నగరంలో ప్రతి ముగ్గుర్లో ఒకరు ఈ హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా టాక్ ఆఫ్ ది సిటీగా మారింది.;
By : A.Amaraiah
Update: 2024-12-31 02:10 GMT
2024.. మరి కొన్ని గంటల్లో కాలగమనంలో కలిసిపోనుంది. మరి ఈ ఏడాదిలో అందర్నీ ప్రత్యేకించి హైదరాబాద్ వాసుల్ని హడలెత్తించిన, గుర్తుపెట్టుకో దగిన పేరు ఏదైనా ఉందంటే అది హైడ్రా. అనతి కాలంలో అపారమైన పేరు ప్రతిష్టల్ని సంపాదించింది. అంతో ఇంతో వివాదాస్పదం అయినా సరే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'ను మించి సూపర్ స్టార్ (SUPER STAR) గా ఎదిగింది. ఈ ఏడాదికే హైలెట్ హైడ్రా నిలిచింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA).. కొందరికిది మోదం కాగా మరికొందరికి వెన్నులో దడ పుట్టిస్తోంది. కబ్జా రాయుళ్లను హడలెత్తిస్తోంది. పర్యావరణ ప్రేమికులను అలరిస్తోంది. సామాన్యులతో జేజేలు కొట్టించుకుంటోంది. తెలంగాణలో ఆస్తి భద్రత, నిర్వహణ, విపత్తుల నిర్వహణ, మెరుగుదల దిశగా పడిన ఓ పెద్ద ముందడుగు హైడ్రా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీసుకున్న అత్యంత ధైర్యసాహసోపేతమైన నిర్ణయాలలో హైడ్రా ఒకటి. సామాన్యుల ఆదరాభిమానాలను చూరగొన్న హైడ్రా 2024 సంవత్సరానికే ఓ హైలెట్.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ ఇది. హైడ్రా అడ్డగోలుగా వ్యవహరిస్తోందంటూ కొందురు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, సామాన్య ప్రజల రక్షణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని కుండ బద్దలు కొట్టి హైడ్రా ను ముందుకు నడిపించి జనాన్ని మెప్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
హైడ్రా ఎలా కదిలిందంటే...
తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత స్థిరంగా, సురక్షితంగా, ఆకర్షణీయంగా మారాలంటే చెరువులు, సరస్సులు, నదీ పరివాహక ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలు అనివార్యం. అందువల్లనే ఏమో హైడ్రా కార్యకలాపాలు కూల్చివేతలతో ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకుంది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు అయింది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరాలో హైడ్రా కీలకంగా వ్యవహరించేలా విధులు అప్పగించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుం వసూలు బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించేలా కసరత్తు మొదలైంది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలు...
కబ్జాల తొలగింపులో భాగంగా హైడ్రా వస్తూనే ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ఆధీనంలోని నాగార్జున కన్వెన్షన్ ను కూల్చింది. హైదరాబాద్ తుమ్మిడి చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ కన్వెన్షన్ ను కట్టినట్టు తేల్చారు. ఎన్.కన్వెన్షన్ కూల్చివేత కబ్జాదారుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించగా సామాన్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీనిపై ఓ ఆటో డ్రైవర్ వెంకట్ గౌడ్ చెప్పిన స్పందనే ఇందుకు నిదర్శనం. "మా రేవంతన్న తీసుకున్న అతి పెద్ద నిర్ణయాలలో ఇదొకటి. హైడ్రా రాకుంటే అక్రమ కట్టడాలు కూలేవా.. నాగార్జున వంటి పెద్ద నటుడికి చెందిన కన్వెన్షన్ కూల్చడమంటే మాటలా సార్" అన్నారు. "మామూలోళ్లు అందులోకి పోతామా సర్, పైగా అది కబ్జా. కబ్జాలను వదిలేస్తే ఎలా సర్ " అంటున్న వెంకట్ గౌడ్ మాట హైడ్రాకు సామాన్యుల నుంచి సానుకూల స్పందన ఉందన్నది అర్థమవుతుంది.
ఆ సరస్సులు ఇప్పుడేవీ..
ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. 145 వరకు మంచినీటి చెరువులు ఉండేవి. సిటీ అభివృద్ధి పేరుతో నగరంలో చెరువులు కనిపించకుండా పోయాయి. కబ్జాలకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 44 ఏళ్ళలో అంటే 1979 నుంచి 2023 వరకూ నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు అందజేసింది. వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్‌పై చర్యలకు దిగింది. ఆ తర్వాత మూసీనది పరివాహక ప్రాంతంపై గురిపెట్టింది. ప్రముఖులు చేసిన కబ్జాలపై ఆరా తీసింది. కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి పెద్దవాళ్లైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ క్రమంలో జన్వాడలోని బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఫామ్ హౌస్‌ను కూల్చి వేస్తారంటూ వార్తలొచ్చాయి. కోర్టుకు వెళ్లడంతో జువ్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత ఆగింది. ఇలా ప్రముఖులు ఎవరైతే కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయో ఇప్పుడు వారందరూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చించి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా వాంఛిస్తోంది.
హైదరాబాద్ లోనే హైడ్రా ఎందుకు?
ఇదో స్వతంత్ర ప్రభుత్వ ఏజెన్సీ. ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ (A.V.Ranganath) హైడ్రాకు నాయకత్వం వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిథి, పరిసర ప్రాంతాల్లో కబ్జాలను, చెరువుల పరిరక్షణ, విపత్తుల నివారణ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు ఈ ఏజెన్సీ ఏర్పాటైంది. సుమారు 2,000 చదరపు కిలోమీటర్లను కవర్ చేస్తుంది. ఈ ఏజెన్సీ సమగ్ర విపత్తుల నిర్వహణ, ఆస్తి వివాదాల పరిరక్షణపై ఇది దృష్టి సారిస్తుంది.
తెలంగాణ జనాభా సుమరు 4 కోట్ల 40 లక్షలనుకుంటే అందులో 35 శాతం మంది జనాభా హైదరాబాద్ లో ఉంటున్నారు. మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో నికరంగా 2 శాతంగా ఉన్న హైదరాబాద్ వైశాల్యం (ఔటర్ రింగ్ రోడ్డు వరకు)లో మూడో వంతు జనాభా ఉంటున్నారు. 2050నాటికి అంటే ఇంకో పాతికేళ్లకు ఆ శాతం సగానికిపైగా చేరుతుందని అంచనా. అంటే తెలంగాణ జనాభాలో సగం మంది ఒక్క హైదరాబాద్ మహానగరంలో ఉండనున్నారు. ఈ పరిస్థితుల్లో భూ కబ్జాలను, అక్రమ నిర్మాణాలను, అనుమతులు లేని కట్టడాలను, నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతి వనరులైన చెరువులు, సరస్సుల్లో కట్టిన కట్టడాలను కచ్చితంగా నివారించాల్సిందేనన్నది నిపుణుల సూచన. హైడ్రా సరిగ్గా ఇప్పుడదే చేస్తోందన్నది ఎక్కువగా వినపడుతున్న అభిప్రాయం.
హైడ్రా లక్ష్యాలేమిటీ?
హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ప్రజా ఆస్తులను పరిరక్షించడం, విపత్తులపై ముందస్తు సిద్ధంగా ఉండటం దీని ప్రధాన లక్ష్యం. తెలంగాణలో ప్లాట్ కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వాటాదారులకు రక్షణ కల్పించడం, నగరాభివృద్ధి దిశగా అడుగులు వేయడం దీని ముఖ్య ఉద్దేశం. జీహెచ్ఎంసీ చట్టంలోని 374 బీ సెక్షన్ కింద హైడ్రా ఏర్పాటు అయింది. దీనిపరిథిలోని మరో ఆరు విభాగాల చట్టాలను కూడా తీసుకువచ్చి ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా హైడ్రా ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను ఎవరైనా కబ్జా చేసి చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. పార్కులు, ఆటస్థలాలు, చెరువులు, రహదారులు, కాలిబాటలు వంటి ముఖ్యమైన సదుపాయాలపై ఆక్రమణలను నివారించడం ద్వారా ప్రజా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై దృష్టి పెడుతుంది.
ప్రత్యేకంగా, హైడ్రా ప్రైవేట్ ఆస్తుల తనిఖీలు చేపట్టి, భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనే దానిపై పర్యవేక్షిస్తుంది. ప్రమాదకరమైన నిర్మాణాలు, అనధికార ప్రకటనలను అరికట్టడం దీని పని. GHMC, స్థానిక సంస్థలు, పోలీస్ విభాగాలతో కలిసి, ఆస్తి నియంత్రణలకు హైడ్రా సమర్థవంతంగా పని చేస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను మరింత భద్రంగా, బాధ్యతాయుతంగా ఉండేలా తీర్చిదిద్దుతుంది.
విపత్తుల నిర్వహణ:
ఏదైనా ప్రకృతివైపరీత్యాలు, విపత్తులు సంభవించినపుడు తక్షణమే స్పందించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి (SDMA), ఇతర ఏజెన్సీలతో హైడ్రా సమన్వయం చేస్తుంది.
భవిష్యత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టి ఆస్తులు, పెట్టుబడులను రక్షించేందుకు ఒక ప్రమాద డేటాబేస్‌ను నిర్వహిస్తుంది. హైడ్రా, పోలీసు, GHMC వంటి విభాగాలతో కలిసి పని చేసి విపత్తుల సమయంలో సహాయ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. హైడ్రా కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వ పరిపాలనా విభాగం దీన్ని పర్యవేక్షిస్తుంది.
స్థూలంగా హైడ్రా పని తీరు ఇలా...
ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేయడం ద్వారా హైడ్రా ట్రాఫిక్ నిర్వహణలోనూ సహాయపడుతుంది. దీంతోపాటు
1. ప్లాట్ కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడడం
2. అధిక భద్రత, ప్రమాదాల నిర్వహణ
3. ఆస్తి విలువ పెరుగుదల
4. శాశ్వత సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల నిర్వహణ
5. ప్రమాదాల నివారణ, విపత్తు వేళల్లో తక్షణ స్పందన
6. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ
హైడ్రాతో హడల్... 2024లో చేసిందేమిటంటే...
HYDRAA కోసం ప్రత్యేకంగా త్వరలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఆస్తి పరిరక్షణ, ఆక్రమణలు తొలగింపు చర్యల్లో భాగంగా HYDRAA- ఇప్పటికి 8 పార్కులు, 12 సరస్సులు, 4 ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది.
సరస్సుల పరిరక్షణకు ఉద్దేశించి FTL (Full Tank Level)ను ఖరారు చేస్తోంది. నాలాల సరిహద్దుల గుర్తింపు కొనసాగుతోంది.
సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్లు, రెవెన్యూ రికార్డులు, గ్రామ/కడస్ట్రల్ మ్యాప్స్, ఉపగ్రహ చిత్రాలు, వైమానిక చిత్రాలతో మొత్తం 1025 నీటి వనరులను గుర్తించారు.
2000 నుంచి 2014 మధ్య తెచ్చిన తీర్మానాలకు అనుగుణంగా ఒక మీటర్ రిజల్యూషన్ కలిగిన ఉపగ్రహ చిత్రాలు, 2006, 2023 సంవత్సరాల మధ్య వైమానిక/డ్రోన్ చిత్రాలు, డిజిటల్ ఎలివేషన్ మోడల్ (DEM)/డిజిటల్ టెర్రైన్ మోడల్ (DTM), బాథిమెట్రిక్ సర్వే తదితర మార్గాలలో సరస్సుల/ కుంటల FTL గుర్తింపు జరుగుతోంది. దీని కోసం NRSC తో అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. సర్వే ఆఫ్ ఇండియా, వివిధ ఉపగ్రహ సంస్థల సహాయాన్ని పొందే ప్రక్రియ కొనసాగుతోంది. కిర్లోస్కర్, Voyants సంస్థలతో నాళాలపై చేసిన గత అధ్యయనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
సరస్సుల విస్తీర్ణం పెరగడం/తగ్గడం, సరస్సు అదృశ్యం అయ్యే విషయాలపై ప్రజల నుండి వచ్చిన అనేక ఫిర్యాదులను, కడస్ట్రల్/టోపోషీట్లు/1 మీటర్ రిజల్యూషన్ కలిగిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి పరిష్కరించారు. ఇప్పటివరకు సుమారు 5800 ఫిర్యాదులు స్వీకరించి వాటిలో మేజారిటీ పరిష్కరించారు. సరస్సుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, మట్టికూడలు, నిర్మాణ సామగ్రి వేయడం వంటి వాటిని ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్/వైమానిక చిత్రాలు, CCTV కెమెరాలతో గుర్తిస్తారు.
ఇప్పటికే 12 చెరువుల పునరుద్ధరణకు హైడ్రా నడుంకట్టింది. ఈ కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చింది. సున్నంచెరువు, ఎర్రకుంట, తమ్మిడికుంట, ఈర్ల చెరువు, నల్ల చెరువు, బతుకమ్మకుంట, తౌతానికుంట, బుమ్రాఖ్ దౌలా లేక్, అప్ప చెరువు, ఎర్రకుంట, కత్వా చెరువు పునరుద్ధరణ కొనసాగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత
2025లో హైడ్రా ఏమి చేయనుందంటే...
2025 సంవత్సరంలో హైడ్రా ఏమి చేయబోతోందో కూడా రోడ్ మ్యాప్ ఖరారైంది.
ఖచ్చితమైన వాతావరణ సూచనల కోసం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
వాతావరణ డేటాను విశ్లేషించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడానికి శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక సాంకేతిక విభాగం ఏర్పాటును పరిశీలిస్తున్నారు.
వాతావరణ సూచనలు/హెచ్చరికలు జారీ చేయడానికి ప్రత్యేక HYDRAA FM ఛానల్ ఏర్పాటు పరిశీలనలో ఉంది.
FTL/బఫర్, నీటి వనరుల ఆక్రమణల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుంది.
ప్రజలు ఆస్తులు కొనుగోలు చేసే ముందు పూర్తిగా పరిశీలించడం అనివార్యం.
భవిష్యత్తులో ఆక్రమణలను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిని పునఃవ్యాఖ్యానించి, మార్గదర్శకాలను కొత్తగా అమలు చేయడం.
ట్రాఫిక్ బాధ్యతల కోసం సుమారు 100మంది DRF సిబ్బందిని శిక్షణ ఇచ్చి హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లలో నియమించారు.
ఆస్తులు కొనేముందు ఏమి చేయాలంటే..
ఆస్తులు కొనుగోలు చేసే ముందు ప్రజలు పూర్తిగా డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. నోటరీలతో ఖరీదైన స్థలాలు, ఇళ్లు కొనుక్కోవద్దు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్తుల కొనుగోలు చేయవద్దు. ఏదైనా ఇల్లు కొనుక్కునే ముందే అది ఎక్కడ నిర్మించారో, అక్రమమో సక్రమమో చూసుకోవాలి.
రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) తమ ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, రోడ్లు, అనధికార నిర్మాణాలు, ఆక్రమణల గురించి హైడ్రాకు ఫిర్యాదు చేయవచ్చు.
FTL ప్రాంతంలో ఉన్న షెడ్లు, ఇతర నిర్మాణాలు అనధికారమని తేలితే వాటిని కచ్చితంగా హైడ్రా కూల్చివేస్తుంది.
"ఇలా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే హైదరాబాద్ నగరం- తన పరిసర ప్రాంతాల్ని, పర్యావరణాన్ని కాపాడుకోగలిగేది. ప్రభుత్వాలు మారినపుడల్లా నిబంధలను సవరించడం, తాత్సారం, అవినీతి లంచగొండితనం వల్ల ఇప్పటికే హైదరాబాద్ చాలా నష్టపోయింది. ఇకనైనా అటువంటి పనులకు స్వస్తి పలకాలి. హైడ్రా ఆ పని చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు ప్రముఖ పర్యావరణ వేత్త, హైదరాబాద్ నగర చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ హైడ్రా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది సిటీగా ఉంది. హైడ్రా యాక్టివిటీ ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద హైడ్రా 2024 సంవత్సరానికి సూపర్ స్టార్ గా నిలిచింది.