రేవంత్ ముహూర్లం పెట్టేశాడు

మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు నవంబర్ 1వ తేదీన శంకుస్ధాపన చేయబోతున్నట్లు స్వయంగా రేవంతే ప్రకటించారు.

Update: 2024-10-29 10:51 GMT
Revanth Reddy

ప్రతిపక్షాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా, బాధితులు ఎంత గోలగోల చేస్తున్నా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మాత్రం మూసీనది(Musi River) పునరుజ్జీవనంపై వెనక్కు తగ్గేదేలే అంటోంది. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు నవంబర్ 1వ తేదీన శంకుస్ధాపన(Foundation Stone) చేయబోతున్నట్లు స్వయంగా రేవంతే ప్రకటించారు. శంకుస్ధాపన చేయబోయే తేదీ చెప్పారు కాని ముహూర్త సమయాన్ని మాత్రాన్ని రేవంత్ సస్పెన్సులో ఉంచారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్ గా తీసుకుంది. ఏ ముహుర్తంలో రేవంత్ ఈ ప్రాజెక్టును ప్రకటించారో తెలీదుకాని అప్పటినుండి ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి. అలాగే బాధితుల ఆర్తనాదాలతో మూసీనది ప్రాంతం గందరగోళంగా తయారైంది.

మూసీనది పరివాహక ప్రాంతంలో 57 కిలోమీటర్లు హైదరాబాద్ నగరం మధ్యలోనే ఉంటుంది. వికారాబాద్ జిల్లాలో పుట్టిన మూసీనది హైదరాబాద్(Hyderabad) గుండా నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో కృష్ణానది(Krishna River)లో కలుస్తుంది. హైదరాబాద్ లో 57 కిలోమీటర్లు ప్రవహించే నది పరిధిలోకి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. మల్కాజ్ గిరి-మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను మూసీనది కవర్ చేస్తోంది. ఒకపుడు మంచినీటిని అందించిన మూసీనది దశాబ్దాల క్రితమే మురికికూపంగా మారిపోయింది. ఈమధ్యనే దక్షిణకొరియా(South Korea), సియోల్(Seoul) లో పర్యటించిన రేవంత్ అక్కడ చంగ్ యే చున్(Cheonggyecheon)నది సుందీకరణను ప్రత్యక్షంగా చూశారు. చంగ్ యే చున్ నది కూడా ఒకపుడు సియోల్ ప్రజలకు మంచినీటిని అందించి తర్వాత ఆక్రమణలకు గురై ఆ తర్వాత మురికికూపంగా మారిపోయింది.

2003లో చంగ్ యే చున్ నది సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టి రెండేళ్ళలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వైనాన్ని తెలుసుకున్న రేవంత్ మూసీనదిని కూడా అదే పద్దతిలో పునరుజ్జీవన చేయాలని కంకణం కట్టుకున్నారు. అప్పటి నుండి మూసీనది పునరుజ్జీవనం ప్రాజెక్టు ఏర్పాటుపై రేవంత్ చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే రేవంత్ ఈ ప్రాజెక్టును ప్రకటించారో అప్పటినుండి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలు అవినీతి ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఇదేసమయంలో నదికి రెండువైపులా ఉన్న 15 వేల నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నివాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నదికి రెండువైపులా తొలగించాల్సిన నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు ఎర్రటి ఇంకుతో ఆర్ బీ (రివర్ బెడ్) అనే మార్కు వేశారు. దాంతో తమ ఇళ్ళను ప్రభుత్వం కూల్చేయబోతోందని నివాసితులు గోల మొదలుపెట్టేశారు.

ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు 200 ఇళ్ళను కూల్చేసింది. ఇందులో నివసించిన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు కేటాయించటంతో పాటు తక్షణ ఖర్చులకు రు. 25 వేలు చెల్లించింది. అంతేకాకుండా ఖాళీచేసిన ఇళ్ళలోని మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు తలా రు. 2 లక్షలు స్వయం సహాయక బృందాల పరిధి పేరుతో చెక్కులను కూడా పంపిణీ చేసింది. అయితే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు సుమారు 100 ఇళ్ళ యజమానులు కోర్టులో కేసులు వేసి స్టేలు తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ వంద ఇళ్ళను ప్రభుత్వం కూల్చుతుందా లేదా అన్నది సస్పెన్సుగా మారింది. వేలాది నివాసితులను అక్కడి నుండి ఖాళీచేసేట్లుగా మున్సిపల్+హైడ్రా ఉన్నతాధికారులు ఇళ్ళ యజమానులతో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎంతవరకు సానుకూలమయ్యాయో తెలీదు. ఇంతలోనే మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టుకు నవంబర్ 1వ తేదీ శంకుస్ధాపన చేయబోతున్నట్లు ముహూర్తం కూడా ప్రకటించారు. ఒకసారి శంకుస్ధాపన జరిగి పనులు మొదలైతే నిలపటం అన్నది ప్రభుత్వానికి ప్రిస్టేజిగా మారిపోతుంది. అలాగని నిరసనలు, ఆందోళనల మధ్య ప్రాజెక్టు పనులను టేకప్ చేయటం ఏ ప్రభుత్వానికీ మంచిదికాదు. మరి నివాసితులను ఖళీచేయించే విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.


Tags:    

Similar News