పురాతన భవనాలతో పొంచి వున్న ముప్పు
శిథిల భవనాల ప్రమాద ఘంటికలు;
నాలుగు శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ మహానగరంలో వేల సంఖ్యలో పురాతన భవనాలున్నాయి. వర్షాకాలం వస్తే ఎక్కడో ఓ చోట పురాతన భవనాలు కూలడం సాధారణమైపోయింది. ప్రతి ఏడాది బల్దియా యంత్రాంగం శిథిల భవనాలను గుర్తించినా, కొన్నింటిని మాత్రమే కూల్చివేస్తుంది. ఏళ్లు గడుస్తున్నా శిథిల భవనాలకు సంబంధించి పాత ఫైళ్ల బూజు దులుపడం తప్ప పెద్ద గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ప్రధానంగా సౌత్‌జోన్, సెంట్రల్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. నాలుగైదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లు కావడంతో ఎప్పుడు కూలతాయే తెలియని పరిస్థితి ఉంది. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన భవనాలు చాలా ఉన్నాయి, అవి సురక్షితంగా లేవు. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, బడీచౌడీ, ముక్తియార్‌గంజ్, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ, చార్మినార్, ఫలక్‌నుమా, యాకత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట, పురానాపూల్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలున్నాయి.
హైదరాబాద్‌లో పాత భవనాలు కూలిపోయి జనాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో జరిగాయి. వీటిలో చాలా భవనాలు నిజాం, బ్రిటీష్ కాలం నాటివి. వర్షాలకు పురాతన భవనాలు నానిపోయి, కూలిపోతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయపడుతున్నారు. దశాబ్దాల క్రితం నాటి ఈ భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతాయోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు సర్కిళ్ల వారీగా పర్యటిస్తున్నారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
గతేడాది నోటీసులకు స్పందించని 252 శిథిల భవనాలు, ఇటీవల గుర్తించిన 284 నిర్మాణాలు కలిపి 536 భవన యాజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇందులో దాదాపు 125 మంది భవనాల యజమానాలకు నచ్చజెప్పి ఖాళీ చేయించారు. 34 చోట్ల శిథిల భవనాలను కూల్చివేశారు. 41 చోట్ల భవనాలకు మరమ్మతులు చేపట్టారు. ఒకచోట భవనాన్ని సీజ్ చేశారు. అయితే ప్రమాదకరంగా మారిన శిథిల భవనాల కూల్చివేత మాత్రం నత్తనడకన సాగుతోంది. ఏదైనా పెద్ద భవనం కూలిపోయినప్పుడు మాత్రమే స్పందన కనిపిస్తోంది.
పాతభవనాల్లో చాలా వరకు యజమానులు, దీర్థకాంలంగా అద్దెకుంటున్నవారు ఆక్రమించుకున్నారు. వారు చౌక అద్దెలు, పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు వంటి కారణాలను చూపుతూ వాటిని ఖాళీ చేయడానికి ఇష్టపడం లేదు. ప్రత్యామ్నాయ నివాసాలు లేక కొంతమంది, అద్దె డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో మరికొంత మంది వీటని ఖాళీ చేయడంలేదు. ఇందులో కొన్నింట్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని భవనాలు నివాస సముదాయాలుగా ఉన్నాయి.
కోర్టుకెక్కుతున్న యజమానులు
కొంత మంది భవన యజమానులు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. ఈ నిర్మాణాలలో కొన్ని చట్టపరమైన చిక్కుల్లో కూడా చిక్కుకున్నాయి. పాత భవనాలను కూల్చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు స్ట్రక్చరల్ ఇంజనీర్లతో సర్వే చేయించి సెక్షన్ 459 ప్రకారం భవన యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. తీసుకోకపోతే భవనాలకు అంటిస్తున్నారు. అయితే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది జీహెచ్‌ఎంసీ నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరికొందరు కోర్టుకెక్కుతున్నారు. అయితే ఈ పాత భవనాల విషయంలో కోర్టులో తగిన వాదన వినిపించడంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఏదైనా పెద్ద భవనం కూలిపోయినప్పుడు మాత్రమే స్పందన కనిపిస్తోంది.