రేవంత్ కు షాకిచ్చిన గవర్నర్

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ కేంద్రహొంశాఖకు పంపారు;

Update: 2025-07-24 13:37 GMT
Governor Jishnu dev Varma shocks Revanth

ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెద్ద షాకిచ్చారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ కేంద్రహొంశాఖకు పంపారు. న్యాయపరమైన సలహాలు, సూచనల కోసం గవర్నర్ సదరు ఆర్డినెన్స్ ను కేంద్రహోంశాఖకు పంపుతారని ప్రభుత్వం ఊహించలేదు. ఆర్డినెన్స్ ఆమోదంపై గవర్నర్ న్యాయ, రాజ్యాంగనిపుణులతో కొద్దిరోజులుగా చర్చిస్తున్నారు. కాబట్టి ఈరోజో లేకపోతే రేపో ఆర్డినెన్స్ పై సంతకం పెట్టేస్తారని ప్రభుత్వం అనుకున్నది. అయితే ఊహించని రీతిలో ఆర్డినెన్స్ ను గవర్నర్ ఢిల్లీకి పంపటంతో షాక్ తిన్నది ప్రభుత్వం.

స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇప్పటికే కేంద్రం దగ్గర మూడునెలలుగా పెండింగులో ఉంది. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) బిల్లును అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రప్రభుత్వ ఆమోదంకోసం రేవంత్(Revanth) ప్రభుత్వం సదరు తీర్మానాన్ని గవర్నర్ సంతకం ద్వారా ఢిల్లీకి పంపింది. ఆబిల్లు రాష్ట్రపతి కార్యాలయంలోనే పెండింగులో ఉండిపోయింది. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపటంలో ఆలస్యం అవుతోందన్న కారణంతోనే రేవంత్ క్యాబినెట్ బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీచేసింది. ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. ఇపుడు సదరు ఆర్డినెన్సును గవర్నర్ కూడా పరిశీలన, సూచనలు, సలహాల కోసం మళ్ళీ ఢిల్లీకే పంపారు. దాంతో బిల్లు, ఆర్డినెన్స్ రెండూ ఇపుడు ఢిల్లీ(Delhi)లోనే ఉన్నాయి.

బిల్లు విషయంలోనే నరేంద్రమోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. అలాంటిది ఇపుడు ఆర్డినెన్సు కూడా ఢిల్లీకే చేరిందంటే ఏమిటి అర్ధం ? తాజా ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో అందరికీ అర్ధమవుతోంది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వానికి పెద్ద సమస్య ఎదురుకాబోతోంది. ఎన్నికల విషయంలో గతంలో హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏమనంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు పెట్టి తీరాలని. అలాగే జూలై 25వ తేదీలోగా పంచాయితి, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ధానాల రిజర్వేషన్లను ఖరారుచేయాలని. సీట్ల రిజర్వేషన్లు ఖరారు కానిదే రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహించేందుకు లేదు. ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం దొరకకపోతే రిజర్వేషన్ల ఖరారు సాధ్యంకాదు. ఈ రెండు జరగకపోతే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లవుతుంది.

ఇలాంటి పరిస్ధితిలో తాజా డెవలప్మెంట్లపై రేవంత్ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. శుక్రవారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఇదే విషయమై చర్చ జరుగుతుంది. క్షేత్రస్ధాయి పరిస్ధితులను వివరించి ఎన్నికల నిర్వహణకు గడువు కోరుతుందా ? లేకపోతే ఇపుడు అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాలని డిసైడ్ చేస్తుందా చూడాలి. ఇపుడు అమల్లో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే అయితే ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు సీట్లు వస్తాయి. తాజా డెవలప్మెంట్ల ప్రకారమైతే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టప్రకారం కాకుండా పార్టీపరంగా మాత్రమే(22శాతం+20 శాతం) అమలుచేయటానికి అవకాశముంది. మరి రేపు జరగబోయే క్యాబినెట్ లో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News